టెహ్రాన్: భారత రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఖమేనీ ట్వీట్ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో ట్విటర్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో... ఇరాన్ అధినాయకుడిగా దేశ భద్రత, విదేశాంగ విధానాలపై నిర్ణయం తీసుకునే ఖమేనీ.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ముస్లింల గురించి బాధపడుతున్న ఆయన.. సొంత దేశం ఇరాన్‌లో ముస్లింలపై జరిగిన ఊచకోతను గుర్తుచేసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ కూడా ఢిల్లీ అల్లర్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ కొన్ని శతాబ్దాలుగా ఇరాన్ భారత్‌తో స్నేహం కొనసాగిస్తోంది. భారతీయులందరూ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. విచక్షణారహిత అల్లర్లు చెలరేగకుండా చూసుకోవాలి. శాంతియుత చర్చలు, చట్టం ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. భారత ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగిన హింసను ఇరాన్ ఖండిస్తోంది’’ అని జావేద్ ట్వీట్ చేశారు.
అదే విధంగా ఇండోనేషియా సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై స్పందించాల్సిందిగా తమ దేశంలో భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... సున్నిత అంశాలపై బాధ్యతా రహితంగా మాట్లాడవద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలకు సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ.... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక సుదీర్ఘకాలంగా ఇరాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్... అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ సంయమనం పాటించిన విషయం విదితమే. ఇరాన్ జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన తర్వాత ఇరాన్ మంత్రి జావేద్ జరీఫ్ భారత్‌లో పర్యటించి పలు అంశాలపై చర్చలు జరిపారు.